జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో డీఎస్పీ రాములు కీలక విషయాలను వెల్లడించారు. అదనపు కట్నం కోసం భర్త హరిబాబే ఆమెను హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. పది నెలల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా, పెళ్లిలో కట్నం రాలేదనే నెపంతో హరిబాబు తల్లిదండ్రులు, అన్నదమ్ములు వైష్ణవిని నిరంతరం వేధించేవారు.
ఈ వేధింపులు భరించలేక వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే రూ. 5 లక్షల నగదుతో పాటు రెండు గుంటల భూమిని కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ, కుటుంబ సభ్యుల ప్రేరేపణతో హరిబాబు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని డీఎస్పీ వివరించారు. ఈ కేసులో నిందితుడు హరిబాబును నిన్ననే అదుపులోకి తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.