లైక్స్ రావ‌డం లేద‌ని యూట్యూబర్‌ ఆత్మహత్య

Youtuber ends life for not getting views in Hyderabad.ఇటీవ‌ల కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కే ఆత్మ‌హ‌త్య‌ల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 8:07 AM IST
లైక్స్ రావ‌డం లేద‌ని యూట్యూబర్‌ ఆత్మహత్య

ఇటీవ‌ల కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కే ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ స‌మ‌స్య‌కు చావే ప‌రిష్కారంలా బావిస్తున్నారు. కానీ.. స‌మస్య‌ను ఎదుర్కొనేందుకు తెగువ‌ను చూపించ‌లేక‌పోతున్నారు. త‌న యూట్యూబ్ ఛానెల్‌కు ఎక్కువ‌గా లైక్స్, వ్యూయ‌ర్స్ రావ‌డం లేద‌ని, ఒంటరిత‌నం వేదిస్తోందంటూ ఓ ఐఐటీ విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న సైదాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన చంద్ర‌శేఖ‌ర‌న్‌, శంక‌రీ దంప‌తులు గ‌త ప‌దేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఆద‌ర్శ్ హైట్స్ రెండో అంత‌స్తులో నివ‌సిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు దీనా(21) గ్వాలియ‌ర్‌లోని ఐఐటీలో నాలుగో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. ఇటీవ‌ల ప‌రీక్ష‌లు రాసి వ‌చ్చి ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే.. గురువారం తెల్ల‌వారుజామున అపార్టుమెంట్ అయిదో అంత‌స్తు నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తాను నిర్వ‌హిస్తున్న యూట్యూబ్ ఛాన‌ల్‌కు లైక్స్ రావ‌డం లేద‌ని క‌ల‌త చెందాడు దీనా. తన ఆవేదనను యూట్యూబ్‌లో పంచుకున్నాడు. అనంత‌రం భ‌వ‌నంపై నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కాగా.. రెండో అంత‌స్తులో త‌ల్లిదండ్రులు, మొద‌టి అంత‌స్తులో అమ్మ‌మ్మ‌, తాతయ్య నివ‌సిస్తున్నా తాను ఒంటరివాడిన‌నే బావించాన‌ని అత‌డు సూసైడ్ నోట్‌లో రాసిన‌ట్లు తెలుస్తోంది.

Next Story