చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది జీవితాలను ముగించుకుంటున్నారు నేటి యువత. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కోడిగుడ్డు కూర వండేందుకు తల్లి నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనానికి కోడిగుడ్డు కూర తీసుకురమ్మని తల్లిని యువకుడు అడిగాడు. అందుకు తల్లి నిరాకరించడంతో యువకుడు తనువు చాలించుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగింది. తల్లిపై కోపంతోనే మామూలేష్ (19) ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
ఎస్‌ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మనోహరాబాద్‌కు చెందిన మస్కూరి నరసింహులు, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతుల చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో భుజం ఒకటి విరిగి ఇంట్లోనే ఉంటున్నాడని సమాచారం. మంగళవారం రాత్రి మామూలేష్ తనకు కోడిగుడ్డు కూర వండమని తల్లిని అడిగాడు. అయితే ఇంట్లో గుడ్లు లేకపోవడంతో వండేందుకు తల్లి నిరాకరించింది. అతని తల్లి ప్రతిస్పందనతో మమూలేష్ ఆమెతో తీవ్ర వాగ్వాదం చేసి ఇంటి నుండి వెళ్లిపోయాడు. కొడుకు గురించి ఆందోళన చెంది, భార్యాభర్తలు అతని కోసం వెతకగా, వ్యవసాయ పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.