మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. పెయింటర్‌గా పనిచేస్తున్న వల్లపునేని శశికుమార్ (21) అనే యువకుడు, కేసముద్రం శివారుకు చెందిన ఒక యువతితో గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నాడు. బుధవారం ఉదయం శశికుమార్ తన ప్రియురాలికి ఫోన్ చేసి వెంటనే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు.
అయితే, ప్రస్తుతం ఇంటర్మీడియట్ వొకేషనల్ పరీక్షలు రాస్తున్న సదరు యువతి, పరీక్షలు ముగిశాక పెళ్లి చేసుకుందామని కోరింది. ఈ విషయంలో ఫోన్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో, మనస్తాపానికి గురైన శశికుమార్ కురవిలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.