భర్త వేధింపులు.. పెళ్ళైన 13 రోజులకే తనువు చాలించిన యువతి

Young woman who died after 13 days of marriage. భర్త వేదింపులు తాళలేక పెళ్ళైన 13 రోజులకే ఓ యువతి ప్రాణాలను తీసుకుంది.

By M.S.R  Published on  20 May 2023 5:15 PM IST
భర్త వేధింపులు.. పెళ్ళైన 13 రోజులకే తనువు చాలించిన యువతి

భర్త వేదింపులు తాళలేక పెళ్ళైన 13 రోజులకే ఓ యువతి ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ బాపునగర్‌ ప్రాంతానికి చెందిన నర్సింహారెడ్డి కూతురు నిషిత(24)ను మేడ్చల్‌ మండలం డబిల్‌పూర్‌ గ్రామానికి చెందిన శ్రీరామ్‌రెడ్డి కొడుకు సంతోష్‌రెడ్డి(27)తో మే 5న పెళ్లి చేశారు.


డబిల్‌పూర్‌లోని అత్తగారి ఇంటికి వెళ్లిన తర్వాత కొద్ది రోజులకు నిషిత ఫోన్‌లో స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. వాటిని చూసిన భర్త సంతోష్‌ రెడ్డి భార్యను నిలదీయడంతో పాటు అనుమానించడం మొదలు పెట్టాడు. మాటామాట పెరిగి ఈ నెల 17న భార్యను తీసుకువచ్చి చింతల్‌ బాపూనగర్‌లోని పుట్టింటి వద్ద వదిలిపెట్టాడు. అదే సమయంలో నిషిత తన తండ్రితో దిగిన ఫొటోను చూపుతూ అసభ్య పదజాలంతో దూషించాడు. 18న మధ్యాహ్నం సమయంలో వచ్చి నిషిత ఫోన్‌లో ఉన్న నంబర్లు, ఇతర సమాచారం తీసుకునే ప్రయత్నం చేశాడు. ఫోన్‌ను లాక్కొని మరీ వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఫోన్‌లో అల్లుడితో ఇంట్లోవారంతా మాట్లాడుతున్న సమయంలో కూతురు నిషిత గ్రౌండ్‌ఫ్లోర్‌కు వచ్చి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కిందకు వచ్చి చూసేలోపే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద 60తులాల బంగారం, ఇతర సామాన్లు, 2 కేజీల వెండి అందించారు. పెళ్లి అయిన వారం పది రోజుల్లో అమ్మాయి పేరుమీద ఉన్న గుమ్మడిదలలోని 550 గజాల ప్లాట్‌ను సైతం రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.


Next Story