ప్రియురాలికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటన.. ఉరేసుకుని యువతి ఆత్మహత్య

మేడ్చ‌ల్‌ జిల్లాలోని పోచారం ఐటి కారిడార్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది

By -  Medi Samrat
Published on : 10 April 2026 2:10 PM IST

ప్రియురాలికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటన.. ఉరేసుకుని యువతి ఆత్మహత్య

మేడ్చ‌ల్‌ జిల్లాలోని పోచారం ఐటి కారిడార్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. గత నెల 11వ తేదీన మృతురాలి ప్రియుడు మనోహర్ బలవంతంగా ఎయిడ్స్ రక్తంతో కూడిన ఇంజక్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ప్రియుడు మనోహర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఎయిడ్స్ రక్తం ఎక్కించడంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురై ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.

మృతురాలు పోచారం ఐటి కార్డార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. మృతురాలికి మనోహర్ బావ వరుస అవుతాడు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఇరువురికి వివాహం నిశ్చయించారు. అయితే మనోహర్‌కు ఎయిడ్స్ ఉన్నట్లుగా అనుమానం రావడంతో యువతి కుటుంబ సభ్యులు అతనికి టెస్ట్ చేయించడం తో హెచ్ఐవి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత నెల 11వ తేదీన యువతి ఇంటికి వెళ్లి హెచ్ఐవీ రక్తంతో ఉన్న ఇంజక్షన్‌ను యువతికి బలవంతంగా ఇచ్చాడు. ఈ ఘటనలో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. తీవ్ర మనస్థాపానికి గురైన యువ‌తి ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story