ఎంత‌కు తెగించారు.. ఆన్‌లైన్‌లో ఆవులు బుక్ చేసి మోస‌పోయిన యువ‌కుడు..!

బిహార్‌ రాష్ట్రంలోని సరన్‌లోని సోన్‌పూర్‌లో ప్రతి సంవత్సరం దేశంలోనే అతిపెద్ద పశువుల సంతను నిర్వహిస్తుంటారు.

By Medi Samrat  Published on  12 Dec 2024 9:52 AM IST
ఎంత‌కు తెగించారు.. ఆన్‌లైన్‌లో ఆవులు బుక్ చేసి మోస‌పోయిన యువ‌కుడు..!

బిహార్‌ రాష్ట్రంలోని సరన్‌లోని సోన్‌పూర్‌లో ప్రతి సంవత్సరం దేశంలోనే అతిపెద్ద పశువుల సంతను నిర్వహిస్తుంటారు. అయినా ఓ యువ‌కుడు ఆవు కోసం సంత‌కు వెళ్ల‌కుండా ఆన్‌లైన్‌కు వెళ్లి మోస‌పోయాడు. ఇంటి నుండి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో ఆవును కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం చాలా ఖరీదైన విష‌యం. పాట్నాకు చెందిన ఓ యువకుడు ఓ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఆవుల జాతులు, వాటి ధరలను వెతుకుతుండగా.. ఆ వెబ్‌సైట్‌లో పొంచి ఉన్న దుండగులు అతడిని టార్గెట్ చేశారు.

ఆ యువకుడి మొబైల్‌కు ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి ఆవు డెలివ‌రీకి సంబంధించిన కాల్ వచ్చింది. దుండ‌గులు యువ‌కుడిని మాట‌ల‌లో పెట్టి మంచి సంభాషణలో ఉండ‌గా.. వాట్సాప్‌లో లింక్ పంపారు. దీంతో ఆవును కొనుగోలు చేసేందుకు ఫారం, పన్ను, ఇతర ఫీజుల పేరుతో రూ.2 లక్షల 10 వేలు టోపీ పెట్టారు. దీంతో ఆ యువకుడు సోమవారం సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఆన్‌లైన్‌లో ఆవుల విక్రయం పేరుతో మోసం చేసిన ఉదంతం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడు వాట్సాప్‌లో పంపిన లింక్‌ను ఓపెన్ చేయగానే కాల్‌లో ఉన్న దుండగుడు.. ఆవు కొనాలంటే ఐదు వేలు పంపండి అని చెప్పాడు. ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా తదుపరి ప్రక్రియ పూర్తి చేద్దామ‌ని చెప్పాడు. పెద్ద డెయిరీ ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యువకుడు నమ్మి రూ.5వేలు బదిలీ చేశాడు. దీని తర్వాత మళ్లీ కాల్ వచ్చింది.. మొత్తం డబ్బును బదిలీ చేయమని చెప్పారు. అప్పుడు మీకు ఆవు డెలివ‌రీ అవుతుంద‌ని తెలిపారు. అనంతరం రూ.15 వేలు బదిలీ చేశాడు. ఇలా చేస్తుండగా.. ఫ్రైసియన్ జాతికి చెందిన ఆరు ఆవులను కొనుగోలు చేయాలనే కోరికతో యువకుడు ఏకంగా రూ.2.10 లక్షలు బదిలీ చేశాడు. రూ.2 లక్షల 10 వేలు బదిలీ చేసిన తర్వాత ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో యువ‌కుడు మోస‌పోయిన‌ట్లు గ్ర‌హించి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

Next Story