Hyderabad: దారుణం.. యువకుడిని కాల్చి చంపిన దుండగులు

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. టప్పాచబుత్ర ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి

By అంజి  Published on  5 April 2023 10:17 AM IST
Hyderabad, Crimenews, Tapachabutra

Hyderabad: దారుణం.. యువకుడిని కాల్చి చంపిన దుండగులు

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. టప్పాచబుత్ర ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి 26 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పాతకక్షల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాతబస్తీకి చెందిన బాధితుడు ఆకాష్ సింగ్.. ఇతరులతో తనకున్న సమస్యను పరిష్కరించేందుకు తనకు తెలిసిన కొంతమంది వ్యక్తులను కలవడానికి టప్పాచబుత్రలోని టూప్‌ఖానా ప్రాంతానికి వెళ్లాడు. అక్కడే అతడిని కాల్చిచంపారు.

''తుపాకీ ఉపయోగించి దుండగులు ఆకాష్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. మూడు నెలల క్రితం అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అతను బెయిల్‌పై బయట ఉన్నాడు'' అని డిసిపి (సౌత్ వెస్ట్) కిరణ్ ఖరే చెప్పారు. ఆకాష్‌తో వివాదాలు ఉన్న క్రాంతి అతనిపై దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు బుక్ చేయబడింది.

క్లూస్‌ టీమ్‌ ఘటనాస్థలికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఓ సమస్యపై చర్చిద్దామనే సాకుతో క్రాంతి ఆకాష్‌ను ఆ ప్రాంతానికి రప్పించాడని, అతనిపై దాడి చేశాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసును విచారించి నిందితులను పట్టుకునేందుకు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో గన్‌తో పాటు కత్తులు కూడా దొరికినట్లు సౌత్ వెస్ట్ జోన్ డిసిపి కిరణ్ తెలిపారు. మృతుడు ఓ బీజేపీ నేతకు బంధువనే మాటలు అక్కడ వినిపిస్తున్నాయి.

Next Story