కోరిక తీర్చాలంటూ యాంకర్‌ను వేధిస్తున్న యువకుడు
Young man Harassment of TV anchor.ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.
By తోట వంశీ కుమార్ Published on 8 Dec 2022 6:53 AM GMTఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. కాదు అనే సరికి ఆమె ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేశాడు. వాటిని ఆ యువతికి చూపించి తన కోరికను తీర్చకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. చివరికి ఆ యువతి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అరెస్ట్ చేశారు.
27 ఏళ్ల యువతి మధురానగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఓ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తోంది. కాలేజీ రోజుల్లో సహ విద్యార్థి అయిన కూకట్‌పల్లికి చెందిన కె.సామ్రాట్ (30)తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని అతడు చెప్పడంతో ఆమె కాదు అని చెప్పింది. అయితే.. మంచి స్నేహితుల్లా ఉందామని ఆమెను అతడు నమ్మించాడు.
మంచివాడిలా నటిస్తూ ఓ సారి టూరిజం ప్లేస్‌కి వెలుదామంటూ తన కారులో తీసుకువెళ్లాడు. మధ్యలో దారి మార్చి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అయితే.. ఎలాగోలా ఆ యువతి తప్పించుకుంది. తన పథకం సఫలం కాకపోవడంతో సామ్రాట్ ఆ యువతిపై పగ బట్టాడు.
రహస్యంగా తీసిన ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ నగ్నచిత్రాలను ఆ యువతికి చూపించి తన కోరికను తీర్చకుంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అతడి వేధింపులు తీవ్రతరం అవుతుండడంతో బాధితురాలు ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.