హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువ‌తి, ఆమె త‌ల్లిపై క‌త్తితో దాడి

Young man attack Girl and her mother in Miyapur.హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2022 2:33 PM IST
హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువ‌తి, ఆమె త‌ల్లిపై క‌త్తితో దాడి

హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువ‌తిని, ఆమె త‌ల్లిని క‌త్తితో పొడిచాడో ఓ ప్రేమోన్మాది. అనంత‌రం తన గొంతు కూడా కోసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఆదిత్య‌న‌గ‌ర్‌లో జ‌రిగింది.

గుంటూరుకు చెందిన యువ‌తి, సందీప్ కుమార్ అలియాస్ బ‌బ్లూ అనే యువ‌కుడు కొంత‌కాలం ప్రేమించుకున్నారు. అయితే.. ఏమైందో తెలీదు గానీ గ‌త రెండేళ్లుగా సందీప్‌ను ఆమె దూరం పెడుతూ వ‌స్తోంది. దీంతో అత‌డు వేరు వేరు నంబ‌ర్ల నుంచి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తూ వేధింపుకు గురి చేస్తున్నాడు. త‌న‌తో మాట్లాడాల‌ని లేదంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించేవాడు. ఆ యువ‌తి అత‌డి నెంబ‌ర్ల‌ను బ్లాక్ చేసింది.

ఈ ఏడాది మే నెల‌లో రేప‌ల్లె నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన యువ‌తి ఆదిత్య‌న‌గ‌ర్‌లో త‌న త‌ల్లి, సోద‌రుడితో క‌లిసి ఉంటోంది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సందీప్ నేరుగా ఆ యువ‌తి ఇంటికి వెళ్లాడు. ఆమెతో గొడ‌వ పెట్టుకున్నాడు. యువ‌తి, ఆమె త‌ల్లిపై కూడా క‌త్తితో దాడి చేశాడు. ఆ త‌రువాత త‌న గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. యువ‌తి, ఆమె త‌ల్లిని చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోకి ఓ ఆస్ప‌త్రికి సందీప్‌ను గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story