వైసీపీ నేత దారుణ హత్య
YCP Leader brutally killed in Sri Sathya Sai District. చౌళూరు రామకృష్ణారెడ్డి(46) దారుణ హత్యకు గురయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 9 Oct 2022 8:20 AM ISTశ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి(46) దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు. రోజులాగానే శనివారం రాత్రి కూడా డాబా మూసివేసిన అనంతరం కారులో ఇంటికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే ఆయన ఇంటి వద్ద మాటు వేసిన దుండగులు ఆయన కారు దిగగానే కళ్లలో కారం పొడి చల్లి తల, గొంతు, చేతులు, కాళ్లపై వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికారు.
రామకృష్ణారెడ్డి అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయిదుగురు దుండగులు రెండు బైక్‌లపై వచ్చారని, ఇద్దరు బైక్‌లపై ఉండగా.. ముగ్గురు దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ విషయం తెలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. రామకృష్ణారెడ్డి భార్య, కుమారుడు బెంగళూరులో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆయన మరణించిన సమాచారాన్ని వారికి అందించారు.