వీరనారి.. దొంగ‌ను అర‌కిలోమీట‌రు వెంటాడి ప‌ట్టుకున్న యువ‌తి

Women catch thief in jubilee hills.క్యాబ్ బుక్ చేస్తుండ‌గా.. దొంగ ఆమె సెల్‌ఫోన్ లాక్కొని ప‌రార‌య్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2021 8:42 AM IST
Women catch thief in jubilee hills

రాత్రి విధులు ముగించుకున్న యువ‌తి మెట్రో ఎక్కేందుకు రాగా.. ఆ స‌మ‌యంలో రైలు అందుబాటులో లేక‌పోవ‌డంతో మెట్రో స్టేష‌న్ కింద నిలుచుంది. క్యాబ్ బుక్ చేస్తుండ‌గా.. దొంగ ఆమె సెల్‌ఫోన్ లాక్కొని ప‌రార‌య్యాడు. వెంట‌నే షాక్ నుంచి తేరుకున్న ఆ యువ‌తి ఆ దొంగ‌ను వెంబ‌డించింది. స్థానికుల సాయంతో అత‌డిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించింది. యువ‌తి చూపిన ధైర్య సాహాసాల‌ను స్థానికుల‌తో పాటు పోలీసులు ప్ర‌శంసించారు. వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల్కాజిగిరి ప్రాంతంలో నివ‌సించే భూమిక‌(29) బంజార‌హిల్స్ రోడ్ నంబ‌ర్‌-12లో ఓ షాపులో పనిచేస్తోంది.

మంగ‌ళ‌వారం రాత్రి విధులు ముగించుకున్న ఆమె మెట్రో ఎక్కేందుకు రాత్రి 10.30స‌మ‌యంలో యూస‌ఫ్‌గూడ చెక్‌పోస్టు వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో మెట్రో రైలు అందుబాటులో లేక‌పోవ‌డంతో.. స్టేష‌న్ కింద నిలుచుంది. ఇంటికి వెళ్లేందుకు ఫోన్‌లో క్యాబ్ బుక్ చేస్తోంది. ఇంత‌లో అటుగా వ‌చ్చిన ఓ వ్య‌క్తి ఆమె చేతిలోంచి ఫోన్ ను లాక్కొని ప‌రార‌య్యాడు. అనుకోని ఈ సంఘ‌ట‌న నుంచి ఆ యువ‌తి క్ష‌ణాల్లో తేరుకుని అత‌డిని వెంబ‌డించింది. ఈ క్ర‌మంలో అటుగా బైక్ పై వ‌స్తున్న ఓ వ్య‌క్తి సాయాన్ని తీసుకుంది. ఆ దొంగ స‌మీపంలో ఉన్న టిఫిన్ సెంట‌న్ గోడ‌కింద దాక్కున్నాడు. స్థానికుల సాయంతో అత‌డిని ఆ యువ‌తి ప‌ట్టుకుంది. అనంత‌రం స్థానికులు అత‌డికి దేహ‌శుద్ది చేసి జూబ్లిహిల్స్ పోలీసుల‌కు అప్ప‌గించారు. నిందితుడిని సినీ ప‌రిశ్ర‌మలో జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేస్తున్న న‌వీన్‌నాయ‌క్ గా గుర్తించారు. భూమిక చూపిన ధైర్య సాహసాల‌ను జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అభినందించారు.



Next Story