బుధవారం నాడు బెంగళూరులోని ఓ రైల్వే వంతెన సమీపంలో చిరిగిన నీలిరంగు సూట్‌కేస్ కనుగొన్నారు. అయితే ఆ సూట్ కేసును తెరచి చూడగా అందరూ షాక్ అయిపోయారు. హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న ఒక మహిళ మృతదేహం అందులో ఉంది. బెంగళూరు శివార్లలోని పాత చందపుర రైల్వే వంతెన సమీపంలో స్థానిక నివాసితులు ఈ సూట్‌కేస్‌ను కనుగొన్నారు. దానిని రైలు నుండి విసిరివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
"ప్రాథమిక దర్యాప్తులో మహిళను వేరే చోట హత్య చేసి, సూట్‌కేస్‌లో దాచి మృతదేహాన్ని కదులుతున్న రైలు నుండి విసిరివేసినట్లు తెలుస్తోంది. మృతదేహంకు సంబంధించి ఎటువంటి గుర్తింపు పత్రం దొరకలేదు. ఆమె పేరు, వయస్సు, ఆమె ఎక్కడి నుండి వచ్చింది వంటి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము" అని ఒక అధికారి తెలిపారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.