నాలుగు డజన్ల కోడి గుడ్లు 49 రూపాయలు అనగానే క్లిక్ చేసింది.. చివరికి..!

ఆన్‌లైన్ లో షాపింగ్ చేసే వాళ్లకు.. సైబర్ దాడులు ఎప్పటికప్పుడు ఎదురవుతూ ఉంటాయి.

By Medi Samrat  Published on  26 Feb 2024 3:51 PM IST
నాలుగు డజన్ల కోడి గుడ్లు 49 రూపాయలు అనగానే క్లిక్ చేసింది.. చివరికి..!

ఆన్‌లైన్ లో షాపింగ్ చేసే వాళ్లకు.. సైబర్ దాడులు ఎప్పటికప్పుడు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఆన్ లైన్ లో గుడ్లను ఆర్డర్ ఇద్దామనుకున్న మహిళ తన అకౌంట్ లో ఉన్న డబ్బులను కోల్పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో గృహోపకరణాలను కొనుగోలు చేసే వారిపై సైబర్ నేరగాళ్లు ప్రముఖ బ్రాండ్‌ల పేరుతో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు చూపించి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. 48 గుడ్లు (నాలుగు డజన్ల) కేవలం రూ. 49కి ఇస్తున్నామంటూ ఓ సైట్ లో చూసిన బెంగళూరుకు చెందిన మహిళ.. వాటిని కొనడానికి ప్రయత్నించి ఏకంగా రూ. 48,000 కోల్పోయింది.

ఈ ఘటనపై ఆమె హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వసంతనగర్ నివాసి అయిన 38 ఏళ్ల మహిళ... ఫిబ్రవరి 17న ఒక ప్రముఖ కంపెనీ గుడ్లను అతి తక్కువ ధరలకు విక్రయిస్తోందని ఇమెయిల్ ప్రకటనను చూసింది. యాడ్‌లో షాపింగ్ కు సంబంధించిన లింక్ ను ఆమె క్లిక్ చేయగా.. మరో పేజీ ఓపెన్ అయింది. అక్కడ కోళ్లను ఎలా పెంచుతారు.. గుడ్లు సేకరించి ఎలా డెలివరీ చేస్తారో చూపించారు.

క్రిందికి స్క్రోల్ చేయగా.. డెలివరీ ఛార్జీలు లేకుండా రూ. 99కి ఎనిమిది డజను గుడ్లను సరఫరా చేస్తున్నట్లు ఆఫర్ ఉంది. అయితే ఆమె రూ. 49కి నాలుగు డజన్ల గుడ్లు కొనాలని భావించింది. ఆర్డర్ చేయడానికి తన బ్యాంకింగ్ వివరాలను నమోదు చేసి దానిపై క్లిక్ చేసింది. తదుపరి పేజీకి తీసుకువెళ్లింది, అక్కడ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా మాత్రమే చెల్లింపు ఎంపికలు చేస్తున్నట్లు చూపించారు. గడువు తేదీ, CVV నంబర్‌తో సహా ఆమె క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేసింది. 'ప్రొసీడ్ టు పేమెంట్'పై క్లిక్ చేసింది. ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వచ్చింది. ఆమె ఓటీపీ టైప్ చేయగానే.. క్రెడిట్ కార్డ్ ఖాతా నుండి మొత్తం రూ. 48,199 కట్ అయిపోయింది.

ఆమెకు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ విభాగం నుండి కాల్ వచ్చింది. ఇలా మీ డబ్బులు కట్ అయ్యాయని తెలిపారు. వెంటనే ఆమె తాను మోసపోయానని తెలుసుకుంది. వెంటనే వారు ఆమె ఖాతాను బ్లాక్ చేసారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కి కాల్ చేసింది. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని అధికారులు ఆదేశించారు. ఆమె క్రెడిట్ కార్డ్‌లో రూ. 3.7 లక్షల పరిమితి ఉందని, క్రాస్ వెరిఫికేషన్ కోసం ఆమెకు బ్యాంక్ నుండి కాల్ రాకపోతే, దుండగులు మరింత డబ్బును స్వాహా చేసి ఉండేవారని పోలీసు అధికారి తెలిపారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story