భార్య భర్తల మధ్య గొడవ.. మూగ కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిన తల్లి
కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ.. తన భర్తతో గొడవల కారణంగా తన ఆరేళ్ల కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిందని పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 6 May 2024 3:30 AM GMTభార్య భర్తల మధ్య గొడవ.. మూగ కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిన తల్లి
కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ.. తన భర్తతో గొడవల కారణంగా తన ఆరేళ్ల కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిందని పోలీసులు ఆదివారం తెలిపారు. పాక్షికంగా కొరకబడిన చిన్నారి మృతదేహం.. మొసలి దవడల నుండి తిరిగి పొందబడింది. దండేలి తాలూకాలోని హలమడి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో సావిత్రి (32), ఆమె భర్త రవికుమార్ (36)పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుట్టినప్పటి నుంచి వినికిడి, మాటతీరుతో బాధపడుతున్న తమ కుమారుడు వినోద్ (6) వైకల్యంపై దంపతులు తరచూ గొడవ పడుతున్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఎందుకు అలా జన్మనిచ్చావంటూ భార్యతో భర్త మూర్ఖంగా గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఈ దారుణం జరిగిందని సమాచారం.
"శనివారం రాత్రి ఇదే విషయంపై వాగ్వాదం పెరగడంతో, సావిత్రి తన కొడుకును రాత్రి 9 గంటల సమయంలో మొసళ్లతో నిండిన నదికి అనుసంధానించబడిన వ్యర్థ కాలువలోకి తన కొడుకును విసిరింది" అని దండేలి రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ బారకేరి తెలిపారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో అగ్నిమాపక దళం డైవర్లతో పాటు పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించబడింది. అయితే చీకటిగా ఉన్నందున, బాలుడి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.
ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో.. శోధన బృందం అప్పటికే బాలుడి కుడి చేతిని తిన్న మొసలి దవడల నుండి చిన్నారి మృతదేహాన్ని వెలికి తీయగలిగారు. మృతదేహంపై తీవ్రగాయాలు, కాటు వేసిన గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. "నిందిత జంటపై ఐపీసీ సెక్షన్ 302 కింద మేము హత్య కేసు నమోదు చేసాము" అని ఇన్స్పెక్టర్ చెప్పారు. "భర్త మేసన్ హెల్పర్‌గా పనిచేస్తుండగా, మహిళ హోమ్‌స్టేలో ఇంటి పనిమనిషిగా పని చేస్తుంది." నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. "తదుపరి విచారణ జరుగుతోంది," ఇన్స్పెక్టర్ తెలిపారు.