మహిళను వివస్త్రను చేసి.. బలవంతంగా మూత్రం తాగించిన తండ్రీకొడుకులు
బీహార్‌లోని పాట్నాలో దారుణం జరిగింది. శనివారం రాత్రి ఓ దళిత మహిళపై తండ్రీకొడుకులు దాడికి పాల్పడ్డారు. ఆపై మహిళను వివస్త్రను చేసి, బలవంతంగా మూత్రం తాగించారు.
By అంజి Published on 25 Sept 2023 6:23 AM ISTమహిళను వివస్త్రను చేసి.. బలవంతంగా మూత్రం తాగించిన తండ్రీకొడుకులు
బీహార్‌లోని పాట్నాలో దారుణం జరిగింది. శనివారం రాత్రి ఓ దళిత మహిళపై తండ్రీకొడుకులు దాడికి పాల్పడ్డారు. ఆపై మహిళను వివస్త్రను చేసి, బలవంతంగా మూత్రం తాగించారు. మహిళ తలకు బలమైన గాయాలు కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చబడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ప్రమోద్ సింగ్, అతని కుమారుడు అన్షు, మరో నలుగురు సహచరులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో దళిత మహిళ ఇంటికి వెళ్లి బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లారు.
ఆమెపై దారుణంగా దాడి చేసి, వివస్త్రను చేసి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో ప్రమోద్ సింగ్ తన కుమారుడికి మహిళ నోటిలో మూత్ర విసర్జన చేయాలని సూచించాడు. ఆ తర్వాత బాధితురాలు తప్పించుకుని తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆ మహిళ కొన్ని నెలల క్రితం ప్రమోద్ సింగ్ వద్ద వడ్డీకి రూ.1500 అప్పుగా తీసుకుని వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ, నిందితులు ఆమె నుండి మరింత డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు, ఆమె ఇవ్వడానికి నిరాకరించింది.
ఎక్కువ డబ్బులు ఇవ్వకుంటే ఊరంతా వివస్త్రగా తిప్పుతామంటూ ప్రమోద్ మహిళను బెదిరించాడు. ఈ బెదిరింపులపై మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది, బాధిత కుటుంబం, దళిత సంఘాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన అనంతరం నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.
ఖుస్రూపూర్ పోలీసులు ఆమెను రక్షించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. 'మేము నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసాము . వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితురాలు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది' అని ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సియారామ్ యాదవ్ తెలిపారు.