ఫేస్‌బుక్ పరిచయం.. ఎస్సై పరీక్ష రాసి తిరిగి వస్తున్న యువతిపై
Woman raped in moving car in UP.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 26 Nov 2021 10:17 AM ISTఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై పరీక్ష రాసి వస్తున్న ఓ యువతిపై కదులుతున్న కారులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మథురలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. 21ఏళ్ల బాధిత యువతి మథురలో నివసిస్తోంది. ఆమె పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ఫేస్‌బుక్‌లో ఆమెకు హరియాణాలోని పాల్వాల్‌కు చెందిన తేజ్‌వీర్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో.. నియామక ప్రక్రియలో భాగంగా మంగళవారం ఆగ్రాలో ఎస్సై రాత పరీక్ష ఉందని అతడికి చెప్పింది. యువతి ఎగ్జామ్‌కు హాజరై రాసింది. ఇదే అదునుగా బావించిన తేజ్‌వీర్ తన స్నేహితుడితో కలిసి కారులో యువతి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. పరీక్ష రాసిన అనంతరం యువతిని తన కారులో ఎక్కించుకున్నాడు.
అనంతరం యువతికి మత్తు మందు ఇచ్చాడు. అనంతరం కదులుతున్న కారులోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి అపస్మారక స్థితిలో ఉండడంతో ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తేరుకున్న అనంతరం యువతి ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు తేజ్‌వీర్‌ను అరెస్ట్ చేశారు.