భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య
Woman pours boiling oil on husband.తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో మరుగుతున్న నూనె ను భర్త పై పోసింది
By తోట వంశీ కుమార్ Published on 7 Sept 2022 9:52 AM ISTకాపురాలు నిలబడాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా అనుమానం మొదలైందా..? ఇక వారి కాపురంలో గొడవలు మొదలైనట్లే. భర్త పరాయి మహిళల వ్యామోహంలో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో మరుగుతున్న నూనె ను భర్త పై పోసింది భార్య. తీవ్రంగా గాయపడిన భర్త ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన గిరిధర్ లాల్ మాంసం వ్యాపారం చేస్తుంటాడు. చిన్నారుల చదువుల నిమిత్తం మూడున్నర సంవత్సరాల క్రితం భార్య రేణుక(40), ఇద్దరు కుమారులు, కుమారైతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. జియాగూడలోని కబేళాలో పనిచేస్తూ దరియాబాగ్‌లో నివసిస్తున్నాడు.
పరాయి స్త్రీ వ్యామోహంలో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని రేణుక ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు జరిగేవి. కాగా.. ఐదు నెలలుగా ఓ మహిళ వద్దే ఉంటూ మూడు రోజుల కిందటే గిరిధర్ తన వద్దకు వచ్చాడని రేణుక అంటోంది. ఈ విషయంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన రేణుక.. వంటింటిలోకి వెళ్లి మరుగుతున్న నూనెను తీసుకువచ్చి గిరిధర్‌పై పోసింది.
గిరిధర్.. తల, ఛాతీ, చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం గిరిధర్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. రేణుక గతంలోనే విజయవాడ పోలీసులకు భర్త గిరిధర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.