పండుగ రోజు ఇంటికి లేటుగా వచ్చిన భర్త.. భార్య క్షణికావేశంతో ఏం చేసిందంటే..
జైపూర్‌లో 35 ఏళ్ల మహిళ తన భర్త కర్వా చౌత్ రోజున ఇంటికి ఆలస్యంగా రావడంతో అతనితో గొడవ పెట్టుకుంది
By Medi Samrat Published on 21 Oct 2024 9:15 PM IST
జైపూర్‌లో 35 ఏళ్ల మహిళ తన భర్త కర్వా చౌత్ రోజున ఇంటికి ఆలస్యంగా రావడంతో అతనితో గొడవ పెట్టుకుంది. ఆ గొడవ కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తన భార్య తీసుకున్న నిర్ణయంతో కలత చెందిన భర్త కూడా ఆమె చీరతోనే ఉరివేసుకుని మరణించాడు. అక్టోబర్ 20న నగరంలోని హర్మదా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
కర్వా చౌత్ రోజున ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు మోనికా అనే మహిళ తన భర్త ఘనశ్యామ్ బంకర్ (38)తో చిన్న గొడవ పెట్టుకుంది. వాగ్వాదం తర్వాత ఘన శ్యామ్.. తన భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఇంటి నుండి బయటకు పరిగెత్తుకుని వెళ్లి, వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. తన భార్య మరణంతో కలత చెందిన ఘనశ్యామ్ ఇంటికి తిరిగి వచ్చి తన భార్య చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకోడానికి ముందు, ఘన శ్యామ్ బంకర్ తన అన్నయ్యకు వాట్సాప్ సందేశంగా "అన్నయ్యా, నేను ఓడిపోయాను, క్షమించండి. గణపత్ జీ, ఘనశ్యాం కండెల్‌తో మాట్లాడండి, వారు మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు మీరు నా స్థానంలో పని చేయాలి... నా భార్య రైలు కింద దూకింది." అని పంపించాడు. ఈ సంఘటన గురించి జైపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, "ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేసిన ఘనశ్యామ్ కర్వా చౌత్ రోజున ఇంటికి ఆలస్యంగా వచ్చాడు, అతనికి , అతని భార్య మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారు ఆత్మహత్య చేసుకుని మరణించారు." అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.