భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే ఉంచడంతో
ఓ మహిళ భర్తను హత్య చేసింది. భర్త మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 7:51 AM ISTమృతుడు అమర్‌నాథ్ సింగ్
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ భర్తను హత్య చేసింది. భర్త మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన వస్తుండడంతో కాల్చడానికి ప్రయత్నించింది. ఇరుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
ఓల్డ్ సుభాష్ కాలనీలో అమర్‌నాథ్ సింగ్, మీరా సింగ్ దంపతులు నివసిస్తున్నారు. అమర్‌నాథ్ సింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు. చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం వారు వేరే ప్రదేశంలో ఉంటున్నారు. ఇంట్లో భార్యతో పాటు అమర్‌నాథ్ సింగ్ ఉండేవాడు. అయితే అతడి భార్యకు మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. తరచూ దంపతులు గొడవ పడుతుండేవారని ఇరుగుపొరుగు వారు తెలిపారు.
ఐదురోజుల క్రితం భర్తను మీరా హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచడంతో దుర్వాసన వస్తుండడంతో కాల్చడానికి ప్రయత్నించింది. చుట్టు పక్కల వాళ్లు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌కు కరెంట్ పెట్టింది.
నాలుగైదు రోజులుగా అమర్‌నాథ్ సింగ్ కనిపించకపోవడంతో అతడి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు పూణెలో ఉంటున్న దంపతుల కుమారుడిని అప్రమత్తం చేయడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి అతి కష్టం మీద ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మహిళ కర్రతో పైకప్పు ఎక్కి ప్రజలను బెదిరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.