మద్యానికి బానిసైన ఓ భర్త.. తన భార్యను నిత్యం వేధించేవాడు. అతడి వేధింపులను తాళలేకపోయిన భార్య.. జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు తన తల్లికి చెప్పేది. దీంతో మద్యపానానికి బానిసైన అల్లుడి అసభ్య ప్రవర్తనతో అత్త విసిగిపోయింది. కోపంతో అల్లుడిని అత్త హత్య చేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొండాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బజార్‌గావ్ గ్రామంలో అల్లుడిపై బండరాయితో దాడి చేసి హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతుడు చంద్రపూర్ జిల్లాకు చెందినవాడు. గ్రామస్థుల వద్ద అప్పులు చేసి మద్యం తాగి భార్యను వేధించేవాడు. మద్యం సేవించి, బాధితుడు తన భార్యను, అత్తగారిని కూడా దుర్భాషలాడాడని, డిసెంబర్ 27 న దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అదే రోజు నిందితురాలైన అత్త తన అల్లుడిపై గ్రామం వెలుపల ఏకాంత ప్రదేశంలో బండరాయితో దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు నేలపైనే కుప్పకూలిపోయి మృతి చెందినట్లు వారు తెలిపారు. డిసెంబరు 28న మృతుడి మృతదేహాన్ని గుర్తించి హత్య కేసు నమోదు చేశారు. పక్కా సమాచారం మేరకు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది.