హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బోరబండ శ్రీరామ్‌నగర్ సమీపంలోని సంజయ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థిని(22) ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని తండ్రి ఆటో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు.
కాగా.. ఇటీవల యువతి తరచుగా ఫోన్ లో చాటింగ్ చేస్తూ కనిపించడంతో.. తల్లిదండ్రులు మందలించారు. దీంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. మంగళవారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో విద్యార్థిని ఈఎస్ఐ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్ మొదటి అంతస్తు పై నుంచి ఈఎస్ఐ ఆస్పత్రి వైపు కిందకు దూకింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు యువతిని 108 వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. యువతి స్టేషన్ పై నుంచి కిందకు దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాదాకరమన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా మెట్రో స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు.