మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మానగర్‌లో సోమవారం రాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా, ఆమె భర్త, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు పాలెబోయిన మంగమ్మ(35)గా గుర్తించారు. ఆమె భర్త నర్సింహులు(42), కుమారుడు రవి(14)లను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 50 శాతం గాయపడిన నర్సింహులు, రవిలను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటికి ఎలా మంటలు అంటుకున్నాయి అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. బెంగళూరులోని నైస్ రోడ్‌లోని చన్నసంద్ర వంతెన సమీపంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగడంతో 35 ఏళ్ల ప్రైవేట్ సంస్థ ఉద్యోగి కాలిపోయాడు. మరణించిన వ్యక్తి ఉత్తరహళ్లి నివాసి. త్యాగరాజనగర్‌లోని బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్‌సోర్సింగ్ (బిపిఓ) కంపెనీలో ఉద్యోగి అయిన దర్శన్ కుమార్‌గా గుర్తించారు. ఆ వ్యక్తి బంధువుల ఇంటి నుంచి హ్యుందాయ్ శాంట్రో కారులో ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారులో ఒక్కడే ఉన్నాడు.