మహబూబ్‌నగర్ జిల్లాలోని కాకర్జాల గ్రామంలో 23 ఏళ్ల కె.గీతాంజలి అనే మహిళను ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీరాం నరేష్ గా గుర్తించారు, అతను ఒక ప్రైవేట్ ఉద్యోగి.
నివేదికల ప్రకారం బాధితురాలు గత రెండు సంవత్సరాలుగా నరేష్ తో కలిసి జీవిస్తోంది. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అయితే, నరేష్ ఇటీవల ఆమెకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. తాను భార్యతో విడాకులు తీసుకున్నానని నమ్మించి గీతాంజలితో సహజీవనం చేశాడు. అయితే నరేశ్ గత కొంతకాలంగా పట్టించుకోకపోవడం, మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలియడంతో గీతాంజలి, నరేశ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక కొల్లూరుకు వచ్చి కుటుంబసభ్యుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. గ్రామానికి వచ్చి తన పరువు తీసిందని గీతాంజలిపై కోపం పెంచుకున్న నరేశ్, పంచాయితీ ముగిసిన తర్వాత పుట్టింటి వద్ద వదిలిపెడతానని బైక్‌పై తీసుకెళ్లాడు. కాకర్జాల గ్రామ శివారులోకి చేరుకోగానే గీతాంజలి కళ్లలో కారం చల్లి, చున్నీతో గొంతు బిగించాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గీతాంజలి మృతదేహాన్ని గుర్తించారు.