కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామంలో ఒక యువకుడి లైంగిక వేధింపులు భరించలేక 35 ఏళ్ల మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఎం. పవన్ గత కొన్ని రోజులుగా ఎం. వసంతను వేధిస్తున్నాడని తెలిపారు. ఆ వేధింపులు భరించలేక వసంత శుక్రవారం పురుగుమందు తాగింది. ఆమెను వెంటనే గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పామర్రు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. శుభాకర్ శనివారం తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు శనివారం పామర్రు-గుడివాడ రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. (ఆత్మహత్య ఆలోచనలు లేదా నిరాశలో ఉన్న వ్యక్తులు సహాయం కోసం '100' కు డయల్ చేయవచ్చు) .