కేరళ రాష్ట్రంలో వైద్యులు నిరసన ప్రదర్శనలకు దిగారు. అందుకు కారణం మహిళా డాక్టర్ పై ఓ పేషెంట్ దాడికి తెగబడడమే..! కొట్టారక్కరాలోని తాలూకా ఆసుపత్రిలో బుధవారం నాడు 22 ఏళ్ల మహిళా డాక్టర్‌ను మద్యం మత్తులో ఉన్న పేషెంట్ కత్తితో పొడిచాడు. అక్కడితో ఆగకుండా కుటుంబ సభ్యులతో కలిసి గొడవకు దిగాడు ఆ వ్యక్తి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా వైద్య నిపుణులు కొట్టారకరలో ధర్నాకు దిగారు.
కొట్టారక్కర పోలీస్ స్టేషన్‌లోని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఆ వ్యక్తి కాలు మీద గాయం ఉండగా డాక్టర్ కట్టుకట్టడం మొదలుపెట్టారు. దీంతో అతను ఉన్నట్లుండి రెచ్చిపోయాడు. కత్తెర మరియు స్కాల్పెల్ ఉపయోగించి చుట్టూ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిపై దాడి చేశాడు. 42 ఏళ్ల సందీప్ అనే వ్యక్తి ఈ దాడికి తెగబడ్డాడు. అతడు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ వందనాను తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ సంఘటన కేరళలో కలకలం రేపింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఈ దాడిని ఖండించడంతోపాటు నిరసనకు పిలుపునిచ్చింది.