కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు
Woman Doctor Commits Suicide With son. కుటుంబ కలహాల కారణంగా కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు.
By Medi Samrat
ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్‌గా స్థిరపడింది. నగరంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. హాయిగా కాలం గడిచిపోతోంది. అయితే.. కుటుంబ కలహాల కారణంగా కుమారుడితో కలిసి ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. ఎంతోమందికి వైద్యం చేసిన ఆమె తన బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడటం నగరంలో కలకలం రేపింది.
దేవీ చౌక్ ప్రాంతంలో ఉన్న బుద్దుడు ఆసుపత్రి వైద్యుడు డి.బుద్దుడి కుమార్తె దొంతంశెట్టి లావణ్య(33) చర్మవ్యాధుల నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఆమెకు వరంగల్ కు చెందిన డాక్టర్ వంశీకృష్ణతో వివాహం జరిగింది. వీరికి ఏడెళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో రెండు నెలల కిందట లావణ్య పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి కుమారుడితో కలిసి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది.
ఈ నేపథ్యంలో లావణ్య భర్త వంశీకృష్ణ ఆమెకు విడాలకుల నోటీసులు పంపాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందింది. తాను చనిపోతే.. తన కొడుకును ఎవరు చూసుకుంటారని అనుకుందో ఏమో.. తన కుమారుడు నిశాంత్(7) కి నిద్రమాత్రలు ఇచ్చి తాను కూడా వేసుకుంది. నిద్రమాత్రలు తీసుకోవడంతో తల్లీకుమారులు ఇద్దరూ ఆపస్మారక స్థితికి వెళ్లిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులకు లావణ్య తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త విడాకుల నోటీసు పంపడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.