నల్లగా ఉన్నావని భర్త వేధింపులు.. నరికి చంపిన భార్య.. మర్మాంగాన్ని కోసేసింది
Woman axes husband to death over frequent taunts about her dark skin.నువ్వు అందంగా లేవు. నల్లగా ఉన్నావు అంటూ
By తోట వంశీ కుమార్ Published on 28 Sept 2022 7:31 AM ISTనువ్వు అందంగా లేవు. నల్లగా ఉన్నావు అంటూ భార్యను భర్త వేధింపులకు గురి చేసేవాడు. ఏదో ఒక రోజు భర్త మారుతాడు అనే ఆశతో ఆ బాధలను భరిస్తూ వస్తోంది భార్య. అయితే.. రోజు రోజుకు అతడి వేధింపులు అధికం అవుతుండడంతో తట్టుకోలేకపోయింది. చివరికి దారుణ నిర్ణయాన్ని తీసుకుంది. భర్తను హత్య చేసింది. అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో జరిగింది.
దుర్గ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమలేశ్వర్ గ్రామంలో అనంత్ సోన్వానీ(40), సంగీత(30) దంపతులు నివసిస్తున్నారు. అనంత్ సోన్వానీ మొదటి భార్య చనిపోవడంతో సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆతరువాత నుంచి అనంత్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. నువ్వు అందంగా లేవు.. నల్లగా ఉన్నావు అంటూ నిత్యం సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరిగేవి.
ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై మరోమారు గొడవ జరిగింది. సహనం కోల్పోయిన సంగీత.. ఆగ్రహంతో పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని భర్తపై దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో అనంత్ సోన్వానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ సంగీతకు కోపం తగ్గలేదు. భర్త మర్మాంగాన్ని కూడా నరికేసింది.
సోమవారం తెల్లవారుజామున తన భర్తను ఎవరో హత్య చేసినట్లు గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగీత మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిపింది. భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకుందని మంగళవారం స్థానిక పోలీస్ అధికారి దేవాన్ష్ రాథోడ్ వెల్లడించారు.