దారుణం.. 20 రోజుల బిడ్డను చంపిన కసాయి తల్లి

Woman Arrested For Killing 20-Day-Old Sick Daughter In Maharashtra.అనారోగ్యంతో బాధపడుతున్న 20 రోజుల కుమార్తెను హత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 3:10 AM GMT
దారుణం.. 20 రోజుల బిడ్డను చంపిన కసాయి తల్లి

ప్ర‌స్తుత స‌మాజం ఎటుపోతుందో అర్థం కావ‌డం లేదు. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కన్నతల్లె హతమార్చడానికి కూడా వెనకాడని రోజులు నేడు మనం చూస్తున్నాం. తొమ్మిది నెలలు తన కడుపున మోసి.. పురిటి నొప్పులు భ‌రించి.. పుట్టిన తర్వాత బిడ్డ‌ను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన అమ్మ.. మాన‌వ‌త్వం కూడా మ‌రిచిపోయింది. మ‌హారాష్ట్ర‌లోని అకోలా జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న 20 రోజుల కుమార్తెను హత్య చేసినందుకు ఓ మహిళను అరెస్టు చేశారు.

లక్ష్మి(26) అడంపూర్ వాడిలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. 20 రోజుల లక్ష్మి కుమార్తె శ్రేయ ఆరోగ్యం అక్టోబర్ 7 న మరింత దిగజారింది. శ్రేయ‌కు చికిత్స చేసేందుకు లక్ష్మి, తన మామతో క‌లిసి చిన్నారిని తెల్హారాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారిని తదుపరి చికిత్స నిమిత్తం అకోలాలోని జిల్లా సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లాల‌ని సూచించారు. అయితే.. లక్ష్మి, ఆమె మామ‌ బాలికను అకోలాకు తీసుకెళ్లలేదు, ఇంటికి వ‌చ్చేశారు.

అరగంట తర్వాత లక్ష్మి, సౌరభ్‌లు శ్రేయను అంబులెన్స్‌లో ఆక్సిజన్ మాస్క్ ధరించి అకోలా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చే స‌రికే చిన్నారి మృతి చెందింద‌ని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో చిన్నారి అనారోగ్యంతో కాకుండా గొంతు నుల‌మ‌డంతో చ‌నిపోయింద‌ని వ‌చ్చింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ల‌క్ష్మీని విచారించ‌గా చేసిన నేరాన్ని అంగీక‌రించింది. హత్య వెనుక ఉద్దేశ్యం మాత్రం ఇంకా తెలియ‌రాలేద‌ని పోలీసులు తెలిపారు. దీంతో ల‌క్ష్మీని అదుపులోకి తీసుకుని మంగ‌ళ‌వారం స్థానిక కోర్టులో హ‌జ‌రుప‌ర‌చ‌గా రెండు రోజుల పోలీసు క‌స్ట‌డీకి పంపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దయానోబా ఫాడ్ తెలిపారు.

Next Story