ఆ సినిమా చూసి.. ప్రియుడు, కుమార్తెతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Wife killed Belagavi realtor.సంచలనం సృష్టించిన రియల్టర్ సుధీర్ బాగ్వాందాస్ కాంబ్లే హత్య కేసు మిస్టరీ వీడింది.
By తోట వంశీ కుమార్ Published on 30 Sept 2022 7:59 AM ISTకర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రియల్టర్ సుధీర్ బాగ్వాందాస్ కాంబ్లే హత్య కేసు మిస్టరీ వీడింది. భార్యే ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇందులో కుమార్తెను కూడా భాగస్వామిని చేసింది. భార్య, కుమార్తెతో పాటు ఆమె ప్రియుడుని బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెళగావికి చెందిన 57 ఏళ్ల సుధీర్ దుబాయ్‌లో వ్యాపారం చేసేవాడు. అతడి భర్య రోహిణి, కుమార్తె స్నేహ బెళగావిలో నివాసం ఉండేవారు. అయితే.. కరోనా కారణంగా సుధీర్ బెళగావికే వచ్చేశాడు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో సుధీర్ ఆమెతో అప్పుడప్పుడూ వాగ్వాదానికి దిగేవాడు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 17న సుధీర్ ఇంట్లోనే శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఎవరో చంపేశారని తల్లీకూతురు విలపిస్తూ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య సరిహద్దు జిల్లాను దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా రియల్టర్ల రంగంలో పనిచేస్తున్న నిపుణులను లక్ష్యంగా చేసుకునే గ్రూపులు ఉన్నాయని, వారే ఈ హత్య చేసి ఉంటారనే ప్రచారం సాగింది. దీంతో ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.
విచారణలో సుధీర్ భార్య రోహిణి, కుమార్తె శ్రేయలపై పోలీసులకు అనుమానం కలిగింది. సుదీర్ మృతదేహాం పై గాయాలు ఉండడంతో పాటు చేయి విరగడం వంటివి చూసి తల్లీ, కుమార్తెతో పాటు ఇంకా ఎవరో ఈ హత్యలో పాల్గొని ఉంటారని అనుమానించారు. తల్లీ, కూతురిని విచారించగా.. దృశ్యం సినిమాలో మాదిరిగా రకరకాల అసత్య ఆధారాలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు వాటిని నమ్మలేదు. చివరికి నిజం ఒప్పకున్నారు.
అక్షయ్ అనే వ్యక్తితో రోహిణి సంబంధం కలిగి ఉంది. భర్తను అడ్డుతొలగించుకోవడానికి రోహిణి ప్లాన్ వేసింది. పథకం ప్రకారణం రోహిణి, ఆమె ప్రియుడు అక్షయ్, కూతురు స్నేహ లతో కలిసి మారణాధాయులతో సుధీర్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో తామే హత్య చేశామని పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు 'దృశ్యం' చిత్రాన్ని వారు ముగ్గురు పది సార్లు చూసినట్లు చెప్పారన్నారు.