హైదరాబాద్: కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఓ వివాహిత వారి వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సౌజన్య అనే యువతికి మహబూబాబాద్ జిల్లాలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన రజినీకాంత్ రెడ్డితో 2020లో వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. వీరు కెపిహెచ్బిలో నివాసం ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ సౌజన్య తాను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సౌజన్య ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసింది.
గత కొంతకాలంగా భర్త, మరిది, అత్త వాళ్లు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని మూడు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొంది. సౌజన్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భర్త, అత్త, మరిది పెట్టే వేధింపులు భరించలేక ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఓ చిన్నారి బాబు అనాథ అయ్యాడు. ఒకవైపు కూతురి మరణం.. మరోవైపు అనాథగా మిగిలిన మనుమడు.. గుండెను పిండేసే ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది.