కర్ణాటకలోని మంగళూరులో గురువారం రాత్రి బజరంగ్ దళ్ మాజీ సభ్యుడు సుహాస్ శెట్టిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వీడియోలో ఈ దాడి ఘటన రికార్డు అయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 1న రాత్రి 8.27 గంటలకు శెట్టి మరో ఐదుగురితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. వారి వాహనాన్ని మరో రెండు కార్లు అడ్డగించాయి. అందులో నుండి ఐదు నుండి ఆరుగురు దుండగులు బయటకు వచ్చారు. ఆ తర్వాత శెట్టిపై కత్తి, ఇతర మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
మరణం గురించి తెలుసుకున్న తరువాత, ఆసుపత్రి వెలుపల పెద్ద సంఖ్యలో హిందూ కార్యకర్తలు గుమిగూడారు, ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు పోలీసులను మోహరించారు. బీజేపీ ఎంపి నళిన్ కుమార్ కటీల్, ఎమ్మెల్యే భరత్ శెట్టి, వివిధ హిందూ సంస్థల నాయకులు ఆసుపత్రిని సందర్శించారు. విశ్వ హిందూ పరిషత్ స్థానిక విభాగం శుక్రవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చింది. ఆసుపత్రి, ఇతర సున్నితమైన ప్రాంతాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఆ ప్రాంతంలో CrPCలోని 144 సెక్షన్ కూడా అమలులో ఉంది.