బ్యాంకు దొంగలను పట్టుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్‌లో ఎస్‌బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాల దోపిడీని పోలీసులు చేధించారు.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 4:38 AM GMTవరంగల్‌లో ఎస్‌బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాల దోపిడీని పోలీసులు చేధించారు. ఏడుగురు సభ్యుల దొంగల ముఠాలోని ముగ్గురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.1.8 కోట్ల విలువైన 2.520 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రాయపర్తి మండలం ఎస్‌బీఐలో నవంబర్ 19న రాత్రి జరిగిన బ్యాంకు దోపిడీ జిల్లాలో కలకలం సృష్టించడమే కాకుండా వివిధ బ్యాంకుల అధికారులు తీసుకుంటున్న భద్రతా చర్యలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎస్‌బీఐ బ్రాంచ్ లోపలికి చొరబడిన దొంగలు ఖాతాదారులు తాకట్టు పెట్టిన రూ.13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్షద్ అన్సారీ (34), షకీర్ ఖాన్ అలియాస్ భోలే ఖాన్ (28), హిమాన్షు బిగం చంద్ ఝన్వర్ (30)గా గుర్తించినట్లు పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రధాన నిందితుడు మహ్మద్ నవాబ్ హసన్ (39), మిగిలిన ముగ్గురు సభ్యులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన జకీర్ అలీ ఖాన్ (35), అక్షయ్ గజానన్ అంబోరే, 24, సాగర్ భాస్కర్ ఘోర్, 32 లుగా గుర్తించారు. ఈ ఇద్దరూ మహారాష్ట్ర నివాసితులు. నలుగురూ పరారీలో ఉన్నారు.
మహ్మద్ నవాబ్ హసన్ ఏడుగురు సభ్యుల ముఠాగా ఏర్పడి మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. వ్యాపారం పేరుతో హైదరాబాద్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. రాయపర్తి మండలం ఎస్‌బీఐలో నవాబ్ హసన్ తొలుత రెక్కీ నిర్వహించి దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 18న హైదరాబాద్‌లో కారు అద్దెకు తీసుకుని రాయపర్తికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు విద్యుత్తు, అలారం వైర్లను కట్ చేసి బ్యాంకును తెరిచారు. గ్యాస్ కట్టర్ సహాయంతో స్ట్రాంగ్ రూం పగులగొట్టి మూడు లాకర్లలోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ బంగారం విలువ రూ.13.61 కోట్లని అధికారులు తెలిపారు.