విశాఖ జిల్లా మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంగటిదిబ్బకు చెందిన నరేంద్ర (21) లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాణిపేట అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర (21) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అతనికి 40 రోజుల క్రితం వివాహమైంది. దంపతులు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నరేంద్ర లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకుని కొంత చెల్లించేశాడు.
రూ.2 వేలు బాకీ ఉండటంతో యాప్ నిర్వాహకులు వేధించారు. దీంతో మిగతా రూ.2 వేలు చెల్లించాడు. అయినా కూడా మరో రూ.2 వేలు పంపాలంటూ కుటుంబ సభ్యుల ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆ యువకుడికి తెలిసిన వాళ్లందరికీ పంపించారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆ యువకుడి భార్యకు కూడా పంపించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరేంద్ర శనివారం అర్ధరాత్రి భార్య నిద్రలో ఉండగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.