దారుణం.. ఆస్తి పంచాలని తండ్రిపై దాడి, వృద్ధుడు మృతి

ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండాపోయింది.

By Srikanth Gundamalla  Published on  29 April 2024 9:27 AM IST
viral video, son, attack,  father,  property,

 దారుణం.. ఆస్తి పంచాలని తండ్రిపై దాడి, వృద్ధుడు మృతి 

ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండాపోయింది. డబ్బులకు ఇచ్చిన ప్రాధాన్యత కుటుంబ సభ్యులు, బంధువులకు ఇవ్వడం లేదు. అంతెందుకు ఆస్తుల కోసం అన్నదమ్ములు.. తండ్రీ కొడుకులు గొడవ పడుతున్న సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆస్తుల గొడవలే హత్యల వరకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కన్న కొడుకు ఆస్తులు పంచాలంటూ తండ్రిపై అమానుషంగా దాడి చేశాడు. వృద్ధుడు అని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్ది.. కాలుతో తన్నాడు. కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ తండ్రి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దారుణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఎ.కులందైవేల (63) శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్నాడు. కులందైవేల వృద్ధుడు అయ్యాడు. దాంతో.. అతని వ్యాపార బాధ్యతలను పంచివ్వాలంటూ కొడుకు సంతోష్‌ గొడవ పెట్టుకున్నాడు. కానీ.. కొడుకు వ్యవహారం నచ్చక కులందైవేల ఆస్తులు పంచలేదు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తండ్రి మాత్రం వినకపోవడంతో... సంతోషం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల మరోసారి తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. విచక్షణ కోల్పోయిన సంతోష్‌ కన్న తండ్రిపై దాడికి తెగబడ్డాడు.

సోఫాలో కూర్చుని ఉన్న తండ్రిపై పిడిగుద్దులు కురిపించాడు. ముఖంపై బలంగా పలుమార్లు దాడి చేశాడు. అక్కడి నుంచి రెండు అడుగులు వెనక్కి వేసి.. మరోసారి తిరిగి వెళ్లి కాలుతో ఎదపై గట్టిగా తన్నాడు. దాంతో.. కొడుకు చేసిన దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కొడుకు దాడి చేస్తుండగా చూసిన స్థానికులు వచ్చి అతన్ని అడ్డుకున్నారు. ఇక అప్పటికే వృద్ధుడు తీవ్రగాయాలపాలై స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ కులందైవేల ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు తండ్రిపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సదురు కొడుకుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కసాయి కొడుకుని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు.


Next Story