Hyderabad: బాలికలను శారీరకంగా వేధిస్తున్న వార్డెన్ భర్త.. బీసీ హాస్టల్‌లో ఘటన

హైదరాబాద్: బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ భర్తపై వికారాబాద్ పోలీసులు పోక్సో చట్టం

By అంజి  Published on  11 April 2023 8:15 AM IST
Vikarabad police, POCSO Act , Hyderabad, Crime news

Hyderabad: బాలికలను శారీరకంగా వేధిస్తున్న వార్డెన్ భర్త.. బీసీ హాస్టల్‌లో ఘటన

హైదరాబాద్: బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ భర్తపై వికారాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. యాదృచ్ఛికంగా వార్డెన్, ఆమె భర్త ఇద్దరికి దృష్టి లోపం ఉంది. బషీరాబాద్‌లోని బీసీ సంక్షేమ హాస్టల్‌లోని వార్డెన్‌ శశిరేఖ భర్త రవి తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ హాస్టల్‌ విద్యార్థినుల నుంచి ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ''రవి తరచుగా హాస్టల్‌కి వెళ్లి అమ్మాయిలను ఆటపట్టించేవాడు. అతను తమను పరుష పదజాలంతో కూడా దుర్భాషలాడాడు'' అని విద్యార్థులు చెప్పారు.

బషీరాబాద్ సబ్‌ఇన్‌స్పెక్టర్ చరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. శశిరేఖ పది శాతం దృష్టి వికలాంగురాలు, రవి పూర్తిగా చూపు వికలాంగుడు. ఇద్దరూ రోజూ హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులను చూసుకుంటున్నారు. ఇటీవల హాస్టల్‌కు వెళ్లిన రవి అక్కడ హాస్టల్‌ విద్యార్థినిలపై దురుసుగా ప్రవర్తించాడు. కొందరు విద్యార్థినిలు అతడి ఆకతాయి చేష్టలను ప్రతిఘటించారు. అప్పటి నుంచి రవి వారిని శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. కాగా విద్యార్థినిల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

తమను సరిగా పట్టించుకోకపోవడంతో వార్డెన్‌పై విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణలో రవి పాడు పనుల గురించి విద్యార్థులు ముందుకు వచ్చి తెలియజేశారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story