వ్యాన్ అదుపు తప్పి బోల్తా.. ఏడుగురు కూలీలు మృతి

Van overturns in Jharkhand, 7 laborers die, 8 seriously injured. గురువారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని సెరైకెలా - ఖర్సావాన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By అంజి  Published on  12 Jan 2023 2:41 PM IST
వ్యాన్ అదుపు తప్పి బోల్తా.. ఏడుగురు కూలీలు మృతి

గురువారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని సెరైకెలా - ఖర్సావాన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న పికప్‌ వ్యాన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. రాజ్‌నగనర్‌ - చైబాసా రోడ్డుపై 30 మంది కూలీలతో వెళ్తున్న పికప్‌ వ్యాన్‌ ఖైర్బాని గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు సహా ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, డజను మంది కూలీలు గాయపడ్డారు.

గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజ్‌నగర్‌ కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు. అక్కడ నుండి వారిని చికిత్స కోసం జంషెడ్‌పూర్‌కు రిఫర్ చేశారు. కూలీలతో నిండిన ఈ వ్యాన్‌ వేగం ఎక్కువగా ఉండటంతో డ్రైవర్‌ కంట్రోల్‌ చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం తెలిపారు. ''రోడ్డు ప్రమాదంలో సెరైకెలా-ఖర్సావాన్‌లో ఏడుగురు మరణించారనే వార్త చాలా బాధాకరం. ప్రమాదంలో గాయపడిన మరికొందరు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు'' అని సోరెన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలిపారు. భగవంతుడు మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఆ నష్టాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Next Story