ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణ ఘటన వెలుగు చూసింది. 18 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రోజున జరిగింది. అత్యాచారం తర్వాత యువతిని నగరంలో ఓ క్రాసింగ్ దగ్గర ఆటోలో నుంచి తోసేసి పరారరయ్యారు. ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన యువతిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ స్నేహితుడు తనను చంపుతానని బెదిరించాడని, తనపై దాడికి పాల్పడ్డాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
నిందితులు ఆమెను విడిచిపెట్టిన సమీపంలో పోలీసు వ్యాన్‌ను గమనించిన ఆమె సహాయం కోసం వారిని సంప్రదించింది. ప్రాథమిక విచారణల తర్వాత, యువతిని ఆమె ఇంటి వద్ద దింపారు. మరుసటి రోజు ఫిర్యాదు చేయమని కోరారు. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ వేరే దారిలో వెళ్లాడని, ఆమె అరుస్తూ కేకలు పెట్టినా ఆటో ఆపలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన తలపై కొట్టి, ఫోన్ లాక్కున్నారని, మూడు గంటల పాటు తనపై అత్యాచారం చేశారని ఆమె చెప్పింది. ఆమెను వాహనం నుండి నెట్టడానికి ముందు వారు గ్యాస్ రీఫిల్లింగ్ కోసం గ్యాస్ స్టేషన్ వద్ద ఆగారని చెప్పింది.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించామని, తక్షణ చర్యలు తీసుకోనందుకు పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) ప్రాచీ సింగ్ తెలిపారు. యువతి చికిత్స కోసం ముగ్గురు సభ్యుల వైద్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది.