ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య చెల్లెలితో కలిసి పారిపోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతి తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. అతని పెద్ద కుమార్తె రెండు సంవత్సరాల క్రితం ఆ వ్యక్తితో వివాహం చేసుకుంది. తన అల్లుడు తరచుగా తమ ఇంటికి వచ్చేవాడని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. తాను పని కోసం బయటకు వెళ్లానని, తాను లేని సమయంలో అల్లుడు తన చిన్న కుమార్తెను ప్రలోభపెట్టి తీసుకెళ్లి పారిపోయాడని తండ్రి పోలీసులకు చెప్పాడు.
అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన కుమార్తె కనిపించలేదు. ఆమె కోసం వెతికినా, కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కనుక్కోలేకపోయారు, దీని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ, సైని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధర్మేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి తన భార్య చెల్లెలితో కలిసి పరారీలో ఉన్నాడని ఆరోపిస్తూ ఫిర్యాదు అందిందని అన్నారు. "ఫిర్యాదు ఆధారంగా, ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. అవసరమైన చర్యలు తీసుకుంటాము" అని ఆయన అన్నారు.
కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జరిగిన ఒక ప్రత్యేక సంఘటనలో ఒక వ్యక్తి తన మరదలితో పారిపోయాడు, కానీ మరుసటి రోజే అతని బావమరిది.. అతని చెల్లిని తీసుకుని పారిపోయాడు. ఆరు సంవత్సరాల వివాహిడు, ఇద్దరు పిల్లల తండ్రి అయిన కేశవ్ కుమార్ (28) ఆగస్టు 23న తన 19 ఏళ్ల మరదలు కల్పనతో పారిపోయాడు. ఒక రోజు తర్వాత, అతని భార్య సోదరుడు రవీంద్ర (22), కేశవ్ 19 ఏళ్ల సోదరితో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయాడు.
వరుసగా జరిగిన ఈ సంఘటనలు రెండు కుటుంబాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి, వారు పోలీసులను ఆశ్రయించారు. సెప్టెంబర్ 14, 15 తేదీలలో జంటలను గుర్తించారు. సమాజ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత, కుటుంబాలు పరిస్థితిని అంగీకరించి అన్ని ఫిర్యాదులను విరమించుకోవడానికి అంగీకరించాయి.