పుదుచ్చేరి విమానాశ్రయంలో అమెరికాకు చెందిన ఒక నేత్ర వైద్యురాలిని విమానం ఎక్కకుండా ఆపేశారు అధికారులు. అందుకు కారణం ఆమె వద్ద ఉన్న ఫోన్. ఏకంగా శాటిలైట్ ఫోన్ తో ప్రయాణిస్తున్న ఆమెని అధికారులు అడ్డుకున్నారు. 32 ఏళ్ల రాచెల్ అన్నే స్కాట్ అనే వైద్యురాలు అరవింద్ కంటి ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించడానికి కేంద్ర పాలిత ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఆమె ఇరిడియం ఉపగ్రహ ఫోన్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమె తమిళనాడులోని మధురైతో పాటూ పలు ప్రదేశాలను కూడా ఇంతకు ముందు సందర్శించింది.
విమానాశ్రయ అధికారులు ఆమె లగేజీని వెతికితే శాటిలైట్ ఫోన్ దొరికింది. ఆ తర్వాత ఆమెను హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కకుండా ఆపారు. లాస్‌పేట పోలీసులకు సమాచారం అందడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. తురాయ, ఇరిడియం వంటి ఉపగ్రహ ఫోన్‌లను భారతదేశంలో టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ముందస్తు అనుమతి లేకుండా వినియోగించడాన్ని నిషేధించారు. జనవరి 30, 2025న, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారతదేశంలోని అన్ని విమానయాన సంస్థలు వీటిని నిషేదించాలని, అలాగే ప్రయాణీకులకు తెలియజేయాలని ఆదేశించింది. విదేశీ పౌరులతో సహా ప్రయాణికులు వ్రాతపూర్వక అనుమతి లేకుండా అటువంటి పరికరాలను తీసుకెళ్లకూడదు.