పబ్‌జీ ఆడొద్దన్నందుకు తల్లిని చంపిన కుమారుడు.. దుర్వాసన రాకుండా రూమ్ ఫ్రెష్‌నర్లు
UP teen kills mother with revolver for not allowing him to play mobile game.ఒకప్పుడు చిన్నారులు బయటకు
By తోట వంశీ కుమార్ Published on 8 Jun 2022 12:07 PM ISTఒకప్పుడు చిన్నారులు బయటకు వెళ్లి ఆటలు ఆడుకునేవారు. అయితే.. ప్రస్తుతం పట్టణాలు విస్తరిస్తున్న క్రమంలో ఆ అవకాశం చాలా మందికి ఉండడం లేదు. బయటకు పంపించడం ఎందుకు అని తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులకు ఫోన్ ఇచ్చి అందులో గేమ్స్ ఆడుకోమని చెబుతూ ఉన్నారు. దీంతో చిన్నారులు ఎక్కువ సమయం గేమ్స్ ఆడుతూ వాటికి బానిసల్లా మారుతున్నారు. ఎంతలా అంటే అందుకోసం ఏమైనా చేస్తున్నారు. పబ్‌జీ గేమ్ ఆడొద్దు అని చెప్పినందుకు తల్లినే కాల్చి చంపాడో మైనర్ బాలుడు. అంతేకాదు రెండు రోజుల పాటు తల్లి మృతదేహాంతో పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్నోలో ఓ మహిళ 16 ఏళ్ల కుమారుడు, పదేళ్ల కుమారై తో కలిసి నివసిస్తోంది. ఉద్యోగ నిమిత్తం ఆమె భర్త వేరే ప్రాంతంలో ఉండేవాడు. ఆమె కుమారుడు పబ్‌జీ గేమ్ ఆడుతూ ఉండేవాడు. రాను రాను ఆ గేమ్‌కు అతడు బానిసైయ్యాడు. చదువుని పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి.. పబ్‌జీ గేమ్ ఆడవద్దని సూచించింది. అయినప్పటికి బాలుడు వినకపోవడంతో.. పలుమార్లు మందలించింది.
తాను గేమ్ ఆడుతున్న ప్రతీసారి తల్లి వద్దని వారిస్తుండడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలుడు.. తల్లి నిద్రిస్తున్న సమయంలో తండ్రి లైసెన్స్ తుపాకీతో కాల్చి చంపాడు. రెండు రోజులుగా మృతదేహాంతో ఇంట్లోనే ఉన్నాడు. మృతదేహాం దుర్వాసన రాకుండా ఉండేందుకు రూమ్ ఫ్రెష్‌నర్లను స్ప్రే చేసేవాడు. మంగళవారం రాత్రి తన తండ్రికి ఫోన్ చేసి.. ఇంట్లో టీవీ రిపేర్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రిషన్ అమ్మను చంపేశాడని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి తన తల్లిని చంపేశాడని పోలీసులకు అతడు చెప్పాడు. అయితే.. ఆమె కుమారై మాత్రం అసలు విషయాన్ని చెప్పింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. తనను చంపేస్తానని బెదిరించాడని వెల్లడించింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా అతడు నిజాన్ని ఒప్పుకున్నట్లు వారు తెలిపారు.