మరణం తర్వాత కూడా న్యాయం జరగకపోతే నా అస్థికలు కాలువ‌లో వేయండి.. భార్య వేధింపులు తాళ‌లేక‌ ఇంజనీర్ ఆత్మ‌హ‌త్య‌

భార్య తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ సూసైడ్ చేసుకున్న టెక్కీ అతుల్ సుభాష్ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో 33 ఏళ్ల ఇంజనీర్ తన భార్య, అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

By Medi Samrat
Published on : 21 April 2025 6:30 AM IST

మరణం తర్వాత కూడా న్యాయం జరగకపోతే నా అస్థికలు కాలువ‌లో వేయండి.. భార్య వేధింపులు తాళ‌లేక‌ ఇంజనీర్ ఆత్మ‌హ‌త్య‌

భార్య తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ సూసైడ్ చేసుకున్న టెక్కీ అతుల్ సుభాష్ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో 33 ఏళ్ల ఇంజనీర్ తన భార్య, అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మోహిత్ యాదవ్ తనపై త‌న‌ అత్తమామలు బెదిరింపులు, తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. నా మరణం తర్వాత కూడా నాకు న్యాయం జరగకపోతే నా అస్థికలను కాలువలో వేయండి’ అని వీడియోలో పేర్కొన్నాడు.

మోహిత్ యాదవ్ గురువారం ఇటావా రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న జాలీ హోటల్‌లోకి ప్రవేశించాడు. మరుసటి రోజు ఉదయం అతను తన గది నుండి బయటకు రాలేదు. సాయంత్రం వేళ అతను ఉరివేసుకుని ఉన్నట్లు హోటల్ సిబ్బంది గుర్తించారని పోలీసు సూపరింటెండెంట్ (నగరం) అభయ్ నాథ్ త్రిపాఠి తెలిపారు.

ఔరియా జిల్లాకు చెందిన మోహిత్ యాదవ్ ఒక సిమెంట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అతను, ప్రియా 2023లో వివాహం చేసుకోవడానికి ముందు ఏడేళ్ల పాటు రిలేష‌న్‌లో ఉన్నారు.

రెండు నెలల క్రితం బీహార్‌లో ప్రైవేట్ టీచింగ్ ఉద్యోగం పొందినప్పుడు ప్రియ గర్భవతి అని, అయితే ఆమె తల్లి తన బిడ్డకు అబార్షన్ చేయించిందని యాదవ్ వీడియోలో ఆరోపించాడు. తన అత్త తన నగలన్నీ తన దగ్గరే ఉంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు నేను కట్నం డిమాండ్ చేయ‌లేదని, అయితే తన భార్య తన కుటుంబ సభ్యులందరిపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించిందని చెప్పాడు. ‘‘నా ఇల్లు, ఆస్తిని తన పేరు మీద రిజిస్టర్ చేయకుంటే మా కుటుంబాన్ని వరకట్నం కేసులో ఇరికిస్తానని నా భార్య నన్ను బెదిరించిందని, ఆమె తండ్రి మనోజ్ కుమార్ తప్పుడు ఫిర్యాదు చేశారని, ఆమె సోదరుడు నన్ను చంపేస్తానని బెదిరించాడు’’ అని వీడియోలో పేర్కొన్నాడు. అప్పటి నుండి, తన భార్య ప్రతిరోజూ తనతో గొడవపడుతుందని.. ఆమె కుటుంబం ఆమెకు మద్దతుగా ఉందని పేర్కొన్నాడు.

యాదవ్ తన తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ వీడియోను ముగించాడు. తన మరణం తర్వాత కూడా తనకు న్యాయం జరగకపోతే తన అస్థిక‌ల‌ బూడిదను కాలువలో వేయమని వారిని కోరాడు.

మహిళలు దాఖలు చేసే తప్పుడు ఫిర్యాదుల నుండి పురుషులను రక్షించడానికి చట్టం లేకపోవడంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. "మీకు ఈ వీడియో వచ్చే సమయానికి నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. మగవారి కోసం ఒక చట్టం ఉంటే నేను ఈ చర్య తీసుకోను. నా భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులను నేను తట్టుకోలేకపోయాను" అని వీడియోలో చెప్పాడు.

యాదవ్ కోటాకు బయలుదేరాడు, కానీ ఇటావాలో ఆగిపోయాడని అతని సోదరుడు తరీన్ ప్రతాప్ చెప్పారు. శుక్రవారం ఉదయం అతని వీడియో ఫోన్‌లకు రావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

Next Story