రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని కడ్తాల్ మండల కేంద్రంలోని బట్టర్ ఫ్లై సిటీ వెంచర్‌లోని ఓ విల్లాలో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. బాధితులను రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలంలో ఉన్న గోవిందాయి పల్లి గ్రామానికి చెందిన గుండెమొని శివ (29), శేషిగారి శివ (24) లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలు బుధవారం రాత్రి సమయంలో జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరించింది. ఈ ఇద్దరు యువకులను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? అసలు ఈ విల్లా ఎవరిది? మృతులు విల్లాకి ఎందుకు వచ్చారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు హత్యలకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో గోవిందాయి పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.