హైదరాబాద్‌లో విషాదం..వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని, యువతి మృతి

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువతులు మృతి చెందారు

By -  Knakam Karthik
Published on : 30 Dec 2025 12:20 PM IST

Crime News, Hyderabad, Sangareddy, Road Accindet, Two young women die

హైదరాబాద్‌లో విషాదం..వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని, యువతి మృతి

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువతులు మృతిచెందిన ఘటనలు ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బాటసింగారం వద్ద జరిగిన ఓ ప్రమాదంలో విద్యార్థిని స్పాట్‌లోనే చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బైక్‌పై వెళ్తున్న సమయంలో బైక్, స్కూటీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో విద్యార్థిని ఎగిరి పక్కన వెళ్తున్న లారీ కింద పడిపోయి మరణించింది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స కోసం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కాగా బాధితులను బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మృతిచెందిన విద్యార్థిని ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంగారెడ్డిలో యువతి దుర్మరణం

ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు పట్టణ జాతీయ రహదారిపై మరో యువతి దుర్మరణం చెందింది. లిఖిత (27) అనే యువతి స్కూటీపై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందకు జారి పక్కన వస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన బస్సు టైర్ కింద పడిపోయింది. బస్సు లిఖిత మీది నుండి వెళ్లిపోవడంతో లిఖిత తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న పటాన్‌చెరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

Next Story