నీటి సంపులో పడి 2 ఏళ్ల చిన్నారి మృతి
Two year old child dies after falling into Water sump.మనం ఏ పని చేస్తున్నా.. మన ఇంట్లోని చిన్నారులు ఏం చేస్తున్నారు
By తోట వంశీ కుమార్ Published on 13 May 2022 7:33 AM GMTమనం ఏ పని చేస్తున్నా.. మన ఇంట్లోని చిన్నారులు ఏం చేస్తున్నారు అనేది ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారు ఆడుకుంటున్నాడరు కదా అని వారిని అలా వదిలివేయకూడదు. మనం కాస్త ఏమరపాటుగా ఉంటే తరువాత బాధపడక తప్పదు. ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశత్తు పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పదేళ్ల కిందట ఒడిషా రాష్ట్రానికి చెందిన అమర్‌దాస్, ఎమిన్‌దాస్ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి గుండ్లపోచంపల్లిలోని ఎస్సీ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోజులాగే ఎమిన్‌దాస్ పనికి వెళ్లింది. ఇంట్లో భర్త అమర్‌దాస్, పదేళ్ల పెద్ద కుమారుడితో పాటు రెండేళ్ల కృష్ణదాస్ ఉన్నారు. పెద్దకుమారుడికి జ్వరం రాగా పడుకొని ఉండగా.. మధ్యాహ్నం సమయంలో అమర్‌దాస్ బయటకు వెళ్లారు.
ఆ సమయంలో చిన్న కొడుకు కృష్ణదాస్ ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న సంపులో పడి మృతి చెందాడు. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తండ్రి అమర్‌దాస్.. సంపులో తేలి ఉన్న కొడుకు మృతదేహన్ని చూసి బోరున విలపించాడు. స్థానికుల సహాయంతో బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.