రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టెకీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఎస్ లావణ్య(23), కేరళకు చెందిన ఆర్ లక్ష్మీ(24)లు చెన్నైలోని హెచ్‌సిఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్‌లో అనలిస్టులుగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో విధులు ముగించుకుని వారు ఇంటికి వెళ్లేందుకు చెన్నైలోని ఓఎంఆర్ వద్ద రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో అటుగా వెలుతున్న ఓ కారు అదుపుతప్పి వారి పైకి దూసుకువెళ్లింది.
ఈ ప్రమాదంలో లావణ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మీ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన లక్ష్మీని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు అదుపు తప్పడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారు 130 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు గుర్తించారు. కారు డ్రైవర్ మోతేష్ కుమార్ (20)ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. నిత్యం రద్దీగా ఉండే ఈ ఐటీ కారిడార్ ప్రాంతంలో జీబ్రా క్రాసింగ్ లేకపోవడంతో పాదాచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు స్థానికులు చెబుతున్నారు.