సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By - Knakam Karthik |
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తమ సంబంధం గురించి అవమానాలను ఎదుర్కొని ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నగర్ పరిషత్‌లో రజని దుండేలే (48) క్లర్క్‌గా పనిచేస్తుండగా, 29 ఏళ్ల మిథున్ నీటి సరఫరా విభాగంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
వివరాల ప్రకారం..కార్యాలయం విధులు ముగిసిన తర్వాత రజిని, మిథున్ ఇంటికి వెళ్లలేదు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మిథున్ వద్ద ఫోన్ ఉండటంతో అతని చివరి ఆచూకీని కనుగొన్నారు. అధికారులు బయావాడికి చేరుకున్నప్పుడు, ఒక పొలం దగ్గర ఆ జంట చెప్పులు, మొబైల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్ దొరికాయి. తరువాత SDRF బృందం సమీపంలోని బావి నుండి వారి మృతదేహాలను బుధవారం బయావాడి గ్రామంలోని బావి నుంచి వెలికి తీశారు.
అయితే ఒకే కార్యాలయంలో పని చేసే ఇద్దరూ సహోద్యోగుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు రజిని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ లెటర్ ఆధారంగా గుర్తించారు. మిథున్‌ను ఒక కొడుకులా భావించారని, సహోద్యోగుల వ్యాఖ్యలతో ఆమె బాధపడ్డారని రజిని సూసైడ్ నోట్‌లో రాశారు. పదే పదే వెక్కిరించడం, వారి ఆరోపణలు మానసిక వేధింపులకు కారణమవుతున్నాయని ఆరోపించారు. ఆమె ఆ సూసైడ్ నోట్‌లో 4–5 మంది వ్యక్తుల పేర్లను కూడా పేర్కొంది. కాగా రజిని ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలిగిన వితంతువు. ఆమె కుమారుడికి త్వరలోనే వివాహం కూడా జరగనుంది. అయితే ఇంతలోనే రజిని ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.