హైదరాబాద్-వరంగల్ హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి బైపాస్ రోడ్డు సమీపంలో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ, యువతి సహా బాధితులు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ బృందం వారి స్వగ్రామమైన వరంగల్ జిల్లాలోని కేసముద్రంలో సంక్రాంతిని జరుపుకుని తిరిగి వస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే నిన్న నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కల్వకుర్తి-నాగర్ కర్నూల్ రహదారి తర్ణికల్ సమీపంలో కారు, ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.