హైదరాబాద్‌లో దారుణ హత్యలు.. ఓ చోట నడిరోడ్డుపై.. మరోచోట పెట్రోల్‌ పోసి..

హైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో హత్యలు కలకలం రేపాయి. వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

By అంజి  Published on  11 Aug 2023 3:39 AM GMT
murder, Hyderabad, Crime news

హైదరాబాద్‌లో దారుణ హత్యలు.. ఓ చోట నడిరోడ్డుపై.. మరోచోట పెట్రోల్‌ పోసి..

హైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో హత్యలు కలకలం రేపాయి. వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. శంషాబాద్‌ పరిధిలో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. శ్రీనివాస్ నగర్ కాలనీలో పూర్తిగా కాలిపోయిన ఒక మహిళ మృత దేహం లభ్యం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు, క్లూస్ టీంతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

అయితే సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక వ్యక్తి పల్సర్ మోటార్ సైకిల్ పై అక్కడకు వచ్చి వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తి సాయి ఎన్ క్లేవ్ లోని ఇళ్ల స్థలాల మధ్య మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటల్లో మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా అర్జీఐఎ పోలీస్ అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే శంషాబాద్ అడిషనల్ డీసీపీ ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

మరో ఘటనలో గుర్తుతెలియని కొందరు దుండగులు ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని కొందరు యువకులు కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు. బండ్లగూడ రాయల్ సీ హోటల్ సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఉన్న ఆఫీసు ముందు కొంతమంది దుండగులు ఒక యువకుడి పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే బండ్లగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడు బార్కాస్‌కు చెందిన షేక్ సయీద్ బావజిర్‌గా పోలీసులు గుర్తించారు. పాత కక్షలు నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడు షేక్ సయీద్ పలు పోలీస్ స్టేషన్లో తనపై హత్యా యత్నం జరగనున్నదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి క్లోస్ టీంలో రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. బండ్లగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story