Hyderabad: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం.. మృతదేహాల దగ్గర బీరుసీసాలు

హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ వ్యక్తి, మహిళ హత్యకు గురయ్యారు.

By అంజి  Published on  15 Jan 2025 7:04 AM IST
Two found murdered, Hyderabad, Crime, Puppalaguda

Hyderabad: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం.. మృతదేహాల దగ్గర బీరుసీసాలు

హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ వ్యక్తి, మహిళ హత్యకు గురయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలోని కొండపై మృతదేహాలు లభ్యమయ్యాయి. గాలి పటాలు ఎగురవేసేందుకు కొండపైకి వెళ్లిన కొందరు యువకులు ఓ వ్యక్తి మృతదేహాన్ని చూసి వెంటనే ‘డయల్ 100’లో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు 60 మీటర్ల దూరంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతులిద్దరూ 30-35 ఏళ్ల మధ్య వయస్సు గల వారని భావిస్తున్నారు.

మహిళ, పురుషుడిని కత్తితో పొడిచి, బండరాళ్లతో చితకబాదారని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాల దగ్గర బీరు సీసాలు, మరికొన్ని సామాగ్రిని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వీరిద్దరూ అక్కడికి చేరుకున్నారని ప్రాథమిక విచారణలో పోలీసులు బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పుప్పాలగూడ, పరిసర ప్రాంతాల్లో మిస్సింగ్ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ప్రాంతం నిర్మాణం, రాళ్లను చూర్ణం చేసే కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందినందున, ఏదైనా నిర్మాణ స్థలం నుండి కార్మికులు కనిపించకుండా పోయారా అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడు భవన నిర్మాణ కార్మికుడిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళకు, పురుషుడికి ఎలాంటి సంబంధం ఉందో ఆరా తీస్తున్నారు. బాధితులు వేరే రాష్ట్ర వాసులుగా అనుమానిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. "వారిని ఇక్కడకు తీసుకువచ్చి హత్య చేశారా లేదా వారు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి చంపారా అని తెలుసుకోవడానికి మేము సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నాము" అని పోలీసు అధికారి తెలిపారు.

Next Story